తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొదటి విడత జాబితా విడుదలైంది. రెండో విడత జాబితాపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరో రెండుమూడు రోజుల్లో రెండో విడత జాబితాను వెల్లడించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది. అయితే, మొదటి విడత జాబితాలో టికెట్లు దక్కని నేతలు కొందరు పార్టీకి రాజీనామా చేయగా.. మరికొందరు పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు బహిరంగంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అధిష్టానంపై, ముఖ్య నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు.
మిగతా పార్టీ టిక్కెట్ల కేటాయింపులపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని, టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం ఇంకా ముగియలేదన్నారు. టిక్కెట్ల కేటాయింపుకు సంబంధించి నాయకులు ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా లేదా నాయకులకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడవద్దని సూచించారు. అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపుల విషయంలో ఏమైనా విభేదాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాలని సూచించారు. కానీ పత్రికా సమావేశాలు, ప్రకటనలు ఇస్తూ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దన్నారు. టిక్కెట్ల కేటాయింపుకు సంబంధించి కొంతమంది నాయకులు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని, అలా చేయడం సరికాదన్నారు. ఏ నాయకులు కూడా టిక్కెట్ కేటాయింపు విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని, వారికి ఏ సమస్య ఉన్నా అధిష్ఠానం దృష్టికి తీసుకు రావాలన్నారు.