ఒక కుటుంబం అన్నాక మనలో మనకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే.. మనకు బయటి వారి నుంచి ఆపద తరుముకొస్తే.. మనమంతా ఒక్కటై ఆ ఆపదను ఎదుర్కొంటాం.. అయితే ఇప్పుడు సరిగ్గా అన్ని దేశాలూ అలాగే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటీ.. అర్థం కాలేదా.. అవునండీ.. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది కదా.. అది ప్రతి దేశానికి కామన్ శత్రువు అయింది. అలాంటి పరిస్థితిలో మనలో మనం తగవులాడుకోవడం ఆపి.. అందరం కలసి కట్టుగా రావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోని ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాలు ఒకేతాటిపైకి రావాల్సిన సందర్భం వచ్చేసింది. అందరమూ కలసి కట్టుగా పోరాడితేనే కరోనా మహమ్మారిపై విజయం సాధించగలం. అవును.. ముమ్మాటికీ అది నిజమే.. ఆ ప్రముఖ బిలియనీయర్ కూడా అదే చెబుతున్నారు. అందరం ఒకే వేదికపై వచ్చి కరోనాకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు. ఆయనే ఆలీబాబా గ్రూప్ అధినేత.. జాక్ మా..!
ప్రపంచంలో ఆలీబాబా గ్రూప్ పేరు వినని వారుండరు. అది చాలా పెద్ద సంస్థ. ఎన్నో బిలియన్ డాలర్ల సంపదను ఆ సంస్థ కలిగి ఉంది. ఆ సంస్థ అధినేత జాక్ మా.. చైనాలోని ధనికుల్లో ఒకరు. ఇంకా చెప్పాలంటే.. ఆయన అక్కడి ధనవంతుల్లో టాప్ ప్లేసులో కొనసాగుతున్నారు. ఆయన కరోనాకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అందుకు గాను తన జాక్ మా ఫౌండేషన్, ఆలీబాబా ఫౌండేషన్‌లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అందులో భాగంగానే ఆ రెండు ఫౌండేషన్ల సౌజన్యంతో https://covid-19.alibabacloud.com అనే ఓ క్లౌడ్ సేవల వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దీన్ని లక్ష్యం ఒక్కటే.. ప్రపంచ దేశాలన్నీ ఈ వెబ్‌సైట్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకోవాలి, కరోనాను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వైద్య విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, సదుపాయాల వివరాలు.. తదితర అంశాలను ఒకరికొకరు పంచుకోవాలి. దీంతో కరోనా వ్యాప్తికి పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చు. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి Global MediXchange అనే పేరు కూడా పెట్టారు.
ఇక ఈ వెబ్‌సైట్ లో చైనాలోని Zhejiang University రూపొందించిన covid 19 prevention and treatment hand book ని కూడా పీడీఎఫ్ రూపంలో ఉంచారు. దాన్ని ఎవరైనా ఆన్‌లైన్‌లో చదవవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకుని చదవవచ్చు. ఇక అందులో సదరు యూనివర్సిటీలో చికిత్స పొందిన 104 మంది కరోనా పేషెంట్లకు చెందిన చికిత్స వివరాలు, వారికి అందించిన మెడిసిన్లు, కరోనా నయం అయ్యేందుకు వైద్యులు అనుసరించిన పలు రకాల విధానాలతోపాటు కరోనా వ్యాప్తి చెందకుండా వ్యక్తులు, హాస్పిటల్స్ పాటించాల్సిన సూచనలు, జాగ్రత్తలను పొందుపరిచారు. ఆ బుక్ చదవడం వల్ల ఆ అంశాలన్నింటినీ ఎవరైనా తెలుసుకోవచ్చు.
కాగా ఆలీబాబా క్లౌడ్ వెబ్‌సైట్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు, హాస్పిటల్స్, ప్రభుత్వాలు, ప్రైవేటు వైద్య సంస్థలు, రీసెర్చి ల్యాబ్‌లు తమ తమ అభిప్రాయాలు, పరిజ్ఞానాలను పంచుకునేందుకు వేదిక అవుతుందని జాక్ మా అభిప్రాయపడ్డారు. Global MediXchange కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి తమ పరిజ్ఞానాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటే కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. ఇక జాక్ మా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఏది ఏమైనా.. ఆయన ఇంతటి బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా అభినందనీయమే..!