రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్నే ప్రవేశ పెడతామని ప్రకటించింది. అదేసమయంలో ఆ పై వచ్చే సంవత్సరం నుంచి 9, 10 తరగతులకు కూడా ఇంగ్లిష్ మీడియంనే అమలు చేస్తామని వెల్లడించింది. అయితే, ఈ నిర్ణయంపై కొన్ని మీడియా సంస్థలు అప్పుడే రాద్ధాంతం చేస్తున్నాయి. నిజమే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఏపీలో తెలుగు భాషను బ్రతికించాల్సిన అవసరం ప్రభుత్వంపైనే ఉంటుంది. ఈ విషయంలో రెండో మాట లేదు. ఈ క్రమంలోనే అన్నగారు ఎన్టీఆర్ అధికారంలో ఉన్న నాటి నుంచి కూడా ప్రభుత్వ స్కూళ్లలో తెలుగుకు ప్రాధాన్యం పెంచారు.
అయితే, ఇప్పటికిప్పుడు ఇలా ఇంగ్లీష్ మీడియంలోకి పాఠశాలలను మార్చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు జరుగుతోంది. దీనిని ప్రజలు హర్షిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇదే రేంజ్లో వినిపిస్తున్నాయి. తెలుగు అవసరమే. కానీ, ఇంగ్లీష్ లేని జీవితాన్ని ఊహించే పరిస్థితి ఉందా? అదేసమయంలో ఉన్నత విద్య ఎక్కడైనా తెలుగు మాధ్యమంలో కొనసాగుతోందా? నీట్ సహా ఐఐటీ పరీక్షలకు ఇంగ్లీష్ ప్రాధాన్య అంశం అయినప్పడు.. జీవితాలు ఇంగ్లీష్‌తోనే ముడిపడినప్పుడు తెలుగును పట్టుకుని వేలాడే వారి సంఖ్య తగ్గుతున్న పరిస్థితి కనిపించడం లేదా. అంతెందుకు భాషకు పట్టంకట్టే కర్ణాటకలోకానీ, తమిళనాడులోకానీ.. కేంద్రంలో కొలువులు సంపాయిస్తున్న వారి సంఖ్య, ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాయిస్తున్న వారి సంఖ్య ఎంత? అని లెక్కలు తీస్తే.. కనిపిస్తున్న పెద్ద మైనస్ ఆంగ్ల లేమి!!
దీనిని తెలుసుకున్న రెండు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక అభిమానం ఇంగ్లిష్‌పై కురిపించక తప్పని సరిపరిస్థితి ఏర్పడింది. ఇక, తెలుగు కోసం ఉద్యమాలు చేస్తున్నామని, తెలుగును అధికార భాషగానే కొనసాగించాలని ఉద్యమాలు చేస్తున్న నాయకుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఏ మీడియంలో చదువుతున్నారు? అనే ప్రశ్నలకు ప్రత్యేకంగా సమాధాన చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా పేదలే. అలాంటి వారికి ఇంగ్లీష్‌ను చేరువ చేయడం అంటే.. వారికి భవిష్యత్తును చేరువ చేయడమే అవుతుందన్న జగన్ వ్యాఖ్యల్లో అంతరార్థాన్ని ఎందుకు గమనించలేక పోతున్నారో అర్ధం కావడం లేదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిన విద్య వ్యవస్థకు పాతకాలపు బూజును అంటించి అదే పరమానందంగా భావిస్తే ఎలా? నిజానికి నేటి తరం తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటున్నారనడానికి జగన్ తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి వ్యతిరేకతా లేకపోవడమే నిదర్శనంగా కనిపిస్తోంది. అయితే, తెలుగును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా విస్మరించలేదు. దానిని ప్రత్యేక సబ్జెక్టుగా బోధిస్తూనే ఆంగ్లానికి పట్టు పెంచేందుకు కృషి చేస్తోంది. తద్వారా విద్యార్థికి మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆశిస్తోంది.