హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు మెట్రో రైలు మియాపూర్ నుంచి నాగోల్ వరకు నడుస్తున్న విషయం విదితమే. కాగా.. ఈ నెలలోనే అమీర్ పేట నుంచి ఎల్బీ నగర్ మధ్య కూడా మెట్రో రైల్ నడవనుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇవాళ ప్రకటించారు. నాంపల్లిలో మెట్రో మల్టీ లెవల్ పార్కింగ్ పనులకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జోషి, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ పై వివరాలను వెల్లడించారు.
ప్రస్తుతం మియాపూర్ నుంచి నాగోల్ వరకు మాత్రమే మెట్రో రైల్ నడుస్తుండగా, ఇకపై అమీర్‌పేట, ఎల్బీ నగర్ నడుమ కూడా మెట్రో రైల్ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో సేఫ్టీ పరీక్షలను నిర్వహిస్తున్నామని, అవి తుది దశకు చేరుకున్నాయని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. పనులు ముగిశాక అమీర్‌పేట, ఎల్బీ నగర్ మెట్రో మార్గాన్ని ప్రారంభిస్తామని, ఈ నెలలోనే ఈ మార్గం మధ్య సేవలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని, అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇంకా నోటిఫికేషన్‌ను విడుదల చేయనందున అమీర్‌పేట, ఎల్బీ నగర్‌ల మధ్య మెట్రో రైల్ సేవలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ప్రారంభిస్తారని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.