RRR సినిమాతో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ క్రేజ్ హాలీవుడ్ వరకూ వెళ్లింది. పాన్ ఇండియానే కాదు ఏకంగా చరణ్ పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ప్రదానోత్సవంలోన చరణ్ పాల్గొన్నారు. కాలిఫోర్నియా వేదికగా తాజాగా జరిగిన ఈ వేడుకలో అమెరికన్ నటి టిగ్ నొటారో చరణ్‌కు క్షమాపణలు చెప్పారు. చరణ్ పేరును ఎలా పలకాలో తెలియడం లేదన్నారు.
టిగ్ నొటారో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో అవార్డ్ ప్రజెంటర్‌గా చరణ్ పాల్గొన్నారు. హాలీవుడ్ నటి అంజలి భీమానీతో కలిసి బెస్ట్ వాయిస్/మోషన్ క్యాప్చర్ అవార్డును అందించారు. అయితే, రామ్‌చరణ్‌ను స్టేజ్ పైకి పిలిచే క్రమంలో టిగ్ నొటారో.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’తో విజయాన్ని అందుకున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ సూపర్‌స్టార్ రామ్..’’ అంటూ చరణ్ అనే పదాన్ని ఎలా పలకాలో తెలియడం లేదని అన్నారు. స్టేజ్ వెనుక ఉన్న బృందం సాయం చేయడంతో చరణ్ అని చెప్పారు. ఆ వెంటనే రామ్‌చరణ్ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు.