బిజెపి అగ్రనేతలు ఏపీపై ఫోకస్ పెట్టారు.. రాష్ట్ర పర్యటలనలకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు వస్తున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా… బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు. ఇంకోవైపు జనసేనతో పొత్తు కొనసాగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జననేన అధినేత పవన్ కల్యాణ్ చెపుతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే యోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం.
గతంలో కర్నూలులో అమిత్ షా పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆయన టూర్ వాయిదా పడింది. అమిత్ షా తాజా పర్యటన రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. పొత్తులపై చర్చించారు. పొత్తులపై చర్చల వేళ అమిత్ షా పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పొత్తులకు సంబంధించి హైకమాండ్ చూసుకుంటుందని, వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు ఇంపార్టెన్స్ ఏర్పడింది. పొత్తులకు సంబంధించి అమిత్ షా ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ బీజేపీ నేతల్లో నెలకొంది. ఓవైపు మోదీ పాలన గురించి వివరిస్తూనే మరోవైపు ఏపీలో పార్టీ బలోపేతానికి బీజేపీ హైకమాండ్ చర్యలు చేపట్టింది.