నిన్న రాత్రి పొద్దుబోయే దాకా అమిత్ షా, రైతు సంఘాల నేతల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు విఫలం అయ్యాయి. ఎవరివాదనలు వారివే…!!! అన్నట్టు నిన్నటి చర్చ సాగింది. ఇక చర్చలో భాగంగా రైతు సంఘాల నేతలకు మరొక సారి మూడు చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను అమిత్ షా వివరించారు. ఎనిమిది మంది రైతు సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించిన అమిత్ షా సుమారు మూడు గంటలకు పైగా వారితో చర్చలు కొనాగించారు. అయితే పంజాబ్ లో అత్యంత పెద్దదైన “భారతీయ కిసాన్ యూనియన్ ఉగ్రహాన్” కు ఆహ్వానం రాకపోవడం చర్చనీయాంశం అయింది.
ఇక ఈ రోజు రైతు సంఘాల నేతలు, ప్రభుత్వం మధ్య జరగాల్సిన చర్చలు రద్దు అయ్యాయి. మూడు చట్టాలలో సవరణలు చేసేందుకు అవకాశం ఉన్న అంశాలను లిఖితపూర్వకంగా ఈ రోజు రైతులకు ప్రభుత్వం అందజేయనున్నట్టు సమాచారం. ప్రభుత్వం ప్రతిపాదించే మార్పుల పై ఈ రోజు మధ్యాహ్నం సింఘూ సరిహద్దులలో రైతు సంఘాల నేతలు సమావేశం కానున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలను కూలంకుషంగా సమీక్షించి, కేంద్ర మంత్రులతో చర్చలు జరిపే అంశంపై రైతు సంఘాల నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక దాదాపు 12 రోజులకు పైగా రైతుల ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.