నేరేడ్ మెట్ కార్పొరేటర్ ఎన్నికపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు ఎట్టకేలకు కోర్టు తీర్పుతో తెరపడింది. ఈ రోజు నేరేడ్‌మెట్‌లోని భవన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ లో 544 ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు మల్కాజిగిరి సర్కిల్ ఎన్నికల అధికారులు తెలిపారు. బీజేపీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇతర ముద్రతో ఉన్న 544 ఓట్లు లెక్కించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఎన్నికపై ఏమైనా వివాదం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని సూచించింది. స్వస్తిక్ కాకుండా ఇతర గుర్తులు ఉన్నా, వాటిని లెక్కించేందుకు అనుమతిస్తూ ఈ నెల 3న ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీతో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. నేరేడ్‌మెట్ డివిజన్‌లో మొత్తం 25136 ఓట్లకు గాను, 24 612 ఓట్లను లెక్కించామని, ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లను మాత్రం లెక్కించకుండా పక్కనపెట్టినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఇప్పటికే టీఆర్‌ఎస్ 504 ఓట్ల మెజారిటీలో ఉందని, ఎన్నికల సిబ్బంది పొరపాటు కారణంగా ఓటర్ల మనోగతం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే… ఇతర గుర్తులు ఉన్న ఓట్లను కూడా లెక్కించేందుకు అనుమతి ఇచ్చామని, ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని వివరించారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించి ఇతర ముద్రతో ఉన్న 544 ఓట్లు లెక్కించాలని ఆదేశాలు జారీ చేశారు.