విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. రమేశ్ ఆసుపత్రి తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై హైకోర్టులో జరిగిన విచారణలో రమేశ్ ఆసుపత్రి తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా హైకోర్టు… స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను కొవిడ్ కేర్ సెంటర్ గా అనుమతించిన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎం అండ్ హెచ్ఓలను ఎందుకు బాధ్యులుగా చేయలేదని ప్రశ్నించింది.
అలాగే స్వర్ణ ప్యాలెస్ ను గతంలో ఎయిర్ పోర్టు క్వారంటైన్ గా సెంటర్ నిర్వహించారా? లేదా? అని అడిగింది. మరోవైపు ఈ అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున చెక్కులను రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నానిలు అందజేశారు.