ఏపీలో బీజేపీ సొంతంగా బలపడడం జరిగే పనికదు.. గత ఆరేళ్లుగా బీజేపీకి ఇక్కడ సీన్ పూర్తిగా అర్థమైంది. రాజధానితో పాటు ఏపీకి చేసే ఇతర సహాయ సహకారాల విషయంలోనే ఏపీ ప్రజలకు బీజేపీ ఏం చేస్తుందనేదానిపై పూర్తి క్లారిటీ వచ్చింది. అందుకే గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్ల కంటే బీజేపీకి తక్కువ ఓట్లు కట్టబెట్టారు. మరో ట్విస్ట్ ఏంటంటే ఏపీ బీజేపీలో చేరేందుకు ఏ కొత్త నేత కూడా ఆసక్తిచూపడం లేదు. యువత కూడా వైసీపీయో లేదా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారే తప్పా బీజేపీలో చేరేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన నేతలకు పునరావాస కేంద్రంగానో లేదా… స్కాములు, స్కీముల్లో అగ్రగణ్యులుగా ఉన్నవారికో బీజేపీ కేంద్రంగా మారింది.
2014 ఎన్నికలకు ముందు నుంచి ఏపీలో బీజేపీలో ఎవరు చేరారన్న లిస్టు పరిశీలిస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరితో మొదలైతే ఇక గత ఎన్నికల్లో టీడీపీ ఓడాక ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కావొచ్చు.. ఇలా లిస్ట్ చూస్తే వీరంతా ఇతర పార్టీలకు చెందిన వారే. నిన్న మొన్నటి వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన కన్నా లక్ష్మీనారాయణ కూడా అదే బాపతు నేత. ఇక ఇప్పుడు మరి కొందరు ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట.
మాజ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుతో మొదలు పెడితే చాలా మందే ఉన్నారట. రంగారావు బంధువు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ద్వారా ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. ఇక అదే విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి, మరో సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజు కూడా బీజేపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇక విశాఖ జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి
దాడి వీరభద్రరావుతో పాటు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా కాషాయం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారని టాక్..?
ఇక టీడీపీకి చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం ఒకటి రెండేళ్లు బలవంతంగా పార్టీలో కొనసాగినా అప్పటి పరిస్థితులను బట్టి బీజేపీలోకి జంప్ చేస్తారన్న గుసగుసలు టీడీపీ వర్గాల్లో ఉన్నాయి. ఏపీల నేతల చిట్టా తీస్తే బడా నేతల నుంచి చాలా మంది మీదనే బీజేపీ కన్ను ఉందని అంటున్నారు.