ఏడుకొండలపై కొలువైన కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. భక్తులతో తిరుమల కొండ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక శ్రావణ మాసం కావడంతో ఇప్పుడు రద్దీ మరి ఎక్కువగా ఉంటోంది. గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మరికొందరు భక్తులేమో తాము మొక్కుకున్నట్లుగా అలిపిరి నడకమార్గంలో వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి ఒక కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నట్లు వెల్లడించారు. తిరుమలలో మంగళవారం రోజున శ్రీవారిని 73,082 మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. మరోవైపు 27,972 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నట్లు చెప్పారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లుగా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు.