జగన్ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముందే ఊహించారని వ్యాఖ్యానించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. తాము చెప్పిందే రాజ్యాంగం అనే గర్వంతో విర్రవీగుతున్న వైసిపి నేతలను ప్రజాక్షేత్రంలో శిక్షించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ” ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పోకడలతో జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించే చట్టసభలను దూషణలకు, అసత్యాలకు వేదిక చేశారు. ప్రతిపక్షాలనే కాకుండా మీడియా, న్యాయవ్యవస్థ పైన దాడికి దిగుతున్నారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేసే పాలకుడు చెడ్డవాడు అయితే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుంది.
రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దానిని అమలు చేసే పాలకుడు మంచివాడు అయితే అది మంచి ఫలితాలను ఇస్తుంది అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1949లో రాజ్యాంగ సభలో అభిప్రాయపడ్డారు. ఆయన నాడు చేసిన వ్యాఖ్యలు జగన్ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని ముందే ఊహించి చెప్పి ఉంటారు” అని చంద్రబాబు లేఖలో వివరించారు.