ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి ఓటమి ఖాయం అన్నారు ఏపీ మంత్రి అనగాని. విలువలు, విశ్వసనీయత గురించి జగన్ మాట్లాడుతుంటే నవ్వోస్తోందని… ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే అమలు చేసి ప్రజలకు జగన్ పంగనామాలు పెట్టారని ఆగ్రహించారు. హామీల అమలు విషయంలో చంద్రబాబును విమర్శించే నైతికత లేదని…చురకలు అంటించారు.
జగన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు.. ఆయన పార్టీ నేతలు కూడా వద్దనుకుంటున్నారని… అందుకునే విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్లోనే కాదు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి ఓటమి ఖాయం అంటూ వ్యాఖ్యానించారు. జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని… ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే అన్ని వ్యవస్థలూ విఫలమయ్యాయంటూ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆగ్రహించారు. గత ప్రభుత్వంలో ఆకలి మంటలతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జగన్ మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదన్నారు.