ఏపీలోని కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆదివారం రాత్రి 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కల్యాణ తంతు జరగనుంది. ఈ నెల 18వ తేదీన స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. 19వ తేదీన కల్యాణం, 20వ తేదీన అరుంధతి నక్షత్ర దర్శనం, రావణ బ్రహ్మ వాహన సేవ, 21వ తేదీ న పండిత సదస్యం, పొన్న వాహన సేవ, 22వ తేదీన వనవిహారోత్సవం, రథోత్సవం జరగనున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది రథోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకోసం 34.1 అడుగుల ఎత్తుతో భారీ రథాన్ని రూ.1.08 కోట్లతో తయారు చేయించినట్లు చెప్పారు. 22వ తేదీన సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 23వ తేదీన శ్రీ చక్రస్నానం, 24వ తేదీన శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఈవో కె. రామచంద్రమోహన్ వివరించారు.