ఇవాళ ఏపీ కేబినేట్ సమావేశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న ఏపీ కేబినెట్… ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై చర్చించనుంది. వైసీపీ హయాంలోని నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం 2019 ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోనుంది. దీనికి అనుబంధంగా ఇచ్చిన జీవో 77 ను కూడా రద్దు చేయనుంది మంత్రివర్గం.
2017లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను నామినేటెడ్ పోస్టుల నియామకానికి ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయం తీసుకోనుంది. కొత్త క్రీడా విధానం, డ్రోన్ , సెమికండక్టర్ , డాటా సెంటర్ పాలసీలపై చర్చించి ఆమోదం తెలియచేయనున్న కేబినెట్…వైసీపీ హయాంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై ఆరా తీయనుంది.
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంపుదల ప్రతిపాదనపై చర్చ ఉండనుంది. ఒలంపిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకం రూ.7 కోట్ల కు పెంపుపైనా చర్చించనున్న కేబినెట్… పరిశ్రమల రంగానికి సంబంధించి ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూ కేటాయింపులపైనా చర్చించే అవకాశం ఉంది.