ఏపీ అధికార పార్టీలో ఒక అంశంపై విస్తృత చర్చ సాగుతోంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలోని పాతిక మంది మంత్రుల్లో ఇద్దరు రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి త్వరలోనే ముహూర్తం కూడా ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు బెర్త్‌ల కోసం పార్టీ లో సీనియర్లు, కొందరు జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే తెరచాటుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. జగన్ మాకే జై కొడతాడని, మేమే దానికి అర్హులమ ని కూడా వారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు అత్యంత సన్నిహితులైన సీనియర్ నేతలతో సిఫారసులకు కూడా రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఇదిలావుంటే, పార్టీ కోసం అహరహం శ్రమించిన మరో సీనియర్ నాయకుడి ఆశల పల్లకి తాజాగా తెరమీదికి వచ్చింది. ఆయనే సీనియర్ నాయకుడు, వివాద రహితుడు, సౌమ్య శీలి, అందరినీ కలుపుకొని పోయే త త్వం ఉన్న నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. గతంలో టీడీపీలో ఉన్న ఈయన ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్ర, రాష్ట్ర మంత్రిగా కూడా చక్రం తిప్పారు. ఎక్కడా పిసరంత కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొనక పోవడం గమనార్హం. అయితే, వైసీపీ ఆవిర్భావం తర్వాత.. ఆయన జగన్ కు జైకొట్టారు. ఎన్ని ఇబ్బందులు పార్టీ ఎదుర్కొన్నా.. ఆయన దాని వెంటే నిలిచారు.
ఒకానొక దశలో పార్టీ ఉంటుందా? ఊడుతుందా? అన్న ప్రచారం జరిగి.. అనేక మంది నాయకులు తమ దారి తాము చూసుకున్నప్పుడు కూడా ఉమ్మారెడ్డి.. వైసీపీతోనే ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డికి.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పార్టీ అధినేత జగన్.. మండలికి పంపించారు. పార్టీలో వ్యూహకర్తగా కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు. పార్టీ ప్లీనరీ నుంచి కీలక నిర్ణయాలు తీసుకునే వరకు కూడా ఉమ్మారెడ్డి పాత్రకు ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో ఉమ్మారెడ్డి అల్లుడు కిలారు రోశయ్యకు జగన్ పొన్నూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఖాళీ అయిన రెండు బెర్త్‌ల్లొ ఒకటి ఆయన కొరుతున్నారు.
నిజానికి ఇప్పుడు ఖాళీ అయిన రెండు బెర్త్‌లను పరిశీలిస్తే.. పిల్లి సుభాష్ చంద్రబోస్.. శెట్టి బలిజ, మోపిదే వి వెంకట రమణారావు మత్స్యకార వర్గానికి చెందిన నాయకులు. అయితే, ఇప్పుడు ఈ రెండు స్థానాలను ఈ సామాజిక వర్గాలకే కేటాయిస్తారా? అలా అయితే, నేతలు ఉన్నారా? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. ఈ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నా.. వారు గత ఏడాది ముందు రాజకీయాల్లోకి వచ్చిన వారు. సో.. ఈ ఈక్వేషన్‌ను పక్కన పెట్టి.. ఇతర వర్గాలకు ఇస్తారా? అనే చర్చ సాగుతోంది. ఇదే కనుక జరిగితే.. తనకు బెర్త్ కేటాయించాలని ఉమ్మారెడ్డి కోరుతున్నారని వైసీపీలో సీనియర్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మండలిలోను చక్రం తిప్పుతున్నారు. మరి ఆయన ఆశలుఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.