పాదయాత్ర మార్గంలో రాజకీయ నేతలను ఎందుకు అనుమతిస్తున్నారు? : హైకోర్టు

-

అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్లే మార్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలను ఎందుకు అనుమతిస్తున్నారని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర సాఫీగా జరిగేందుకు పోలీసులు, అమరావతి రైతులు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

పాదయాత్రను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ అమరావతి ఐకాస దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన ఘటన వివరాలను రైతుల తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 600 మందికే హైకోర్టు అనుమతిచ్చిందని, అంతకంటే ఎక్కవ మంది యాత్రలో పాల్గొంటున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

దీనిపై రైతుల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. రైతులకు సంఘీభావం తెలిపేవారు కూడా యాత్రలో పాల్గొంటున్నారని అందుకే ఎక్కువ మంది కనిపిస్తున్నారని వివరణ ఇచ్చారు. అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్లే మార్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలను ఎందుకు అనుమతిస్తున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర సాఫీగా జరిగేందుకు పోలీసులు, అమరావతి రైతులు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది. రైతుల పిటిషన్‌పై శుక్రవారం విచారణ అనంతరం తీర్పు వెలువడే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version