విజయవాడ ఏ కన్వెన్షన్‌లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంతకుముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. అద్భుత మెజార్టీతో 164 స్థానాలను కూటమి దక్కించుకుందని.. ఎన్డీయే కూటమి 21 లోక్‌సభ స్థానాలను దక్కించుకుందని తెలిపారు.
ఎన్డీయే కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ఎలా ఉండాలో అందరూ కలిసికట్టుగా చూపించామని తెలిపారు. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదన్న పవన్ .. ఐదు కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు. అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. చంద్రబాబు నాయకత్వం, అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.