మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారానికి వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ గురువారం జస్టిస్ ఎం.లక్ష్మణ్ వెకేషన్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. అప్పటికే సాయంత్రం 6 గంటలు దాటడంతో విచారణకు ఎంత సమయం పడుతుందని న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ ప్రశ్నించారు.
వాదనలకు గంట సమయం పడుతుందని సీబీఐ తరపు న్యాయవాది తెలుపగా.. పిటిషనర్ వాదనలను బట్టి తమకు సమయం పడుతుందని.. సునీత తరపు న్యాయవాది చెప్పారు. దీంతో ఈ కేసు విచారణను ప్రత్యేకంగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు చేపడతామంటూ వాయిదా వేశారు. ఇవాళ కూడా అన్ని పక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని రేపు ప్రత్యేకంగా ఈ ఒక్క కేసే విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.