ఒంగోలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కంట తడి పెట్టుకున్నారు. మా సొంత పార్టీ వారే ఎక్కడో అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్‌తో, తెలంగాణలో ఉన్న గోనె ప్రకాష్ రావుతో నన్ను తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయకపోయినా నాపై, నా కొడుకుపై ఆరోపణలు చేయడం భరించలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నానని.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం అభిమానుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని పేర్కొన్నారు.
1987 నుంచి యూత్ కాంగ్రెస్ లో ఉంటూ విలువలతో కూడిన రాజకీయం చేశాను. 1999 లో వైఎస్ దీక్షతో ఎమ్మెల్యే పదవి దక్కింది. ఆ తర్వాత 2009లో వైయస్ చలవ వల్ల మంత్రి అయ్యాను…వైయస్ మరణాంతరం వైయస్ జగన్ కోసం మంత్రి పదవి వదులుకొని వచ్చానని వెల్లడించారు. గోనె ప్రకాష్ రావు.. జగన్‌ను, విజయమ్మను విమర్శిస్తాడు. వైవి సుబ్బారెడ్డిని పొగుడుతాడు. ఇదేమి రాజకీయం అని ఫైర్ అయ్యారు. పార్టీలో నేను చేసిన తప్పేంటి. ఏం తప్పు చేశానో చెప్పండి. రాజకీయాలు మానుకుంటాను…నేను పడుతున్న ఇబ్బందులు. నాపై వస్తున్న ఆరోపణలతో నా చావేదో నేను చస్తాను కాని, కార్యకర్తలకు ఇబ్బంది కలిగించే పనులు చేయనని వివరించారు బాలినేని.