ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో కలిసి పని చేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఆ దిశగా ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. గురువారం రాత్రి అమిత్ షా, జేపీ నడ్డా, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ దిశగానే చర్చలు జరిగినట్లు తెలిసింది.
పొత్తుల విషయంలో ఆలస్యమైనందున మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని, విజయావకాశాల ఆధారంగానే ముందుకెళ్లాలని మూడు పక్షాలు నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్డీయే పూర్వ మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీకి ఆహ్వానమందడంతో చంద్రబాబు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.