ఏమాటకామాట చెప్పుకోవాలంటే… టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శల వర్షం కురిపించాలంటే మాత్రం వైకాపా నేతలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంటుంది. అది అసెంబ్లీ అయినా, పత్రికా సమావేశం అయినా, టీవీ ఇంటర్వూ అయినా. ఈ విషయంలో ఎవరెవరు పోటీ పడుతుంటారు అనే పేర్లు చెప్పుకుంటూపోతే లెక్క పెద్ద చాంతాడంత అవుతుందన్ని ఆగడం కానీ… లేదంటే వరుసపెట్టి వైకాపా నేతల పేర్లు రాసుకుంటూపోవచ్చు! అంతెందుకు… సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు వరకూ బాబు పేరుచెబితే ఒంటికాలిపై విరుచుకు పడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా బుగ్గన రాజేంద్రనాథ్.. చంద్రబాబుపై తనదైన వెటకారం చూపించారు!
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా తో ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఒక వర్గం మీడియాలో ఎలాంటి కథనాలు వచ్చేవి అనే విషయంపై బుగ్గన తనదైన శైలిలో వెటకారం ఆడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కానీ పవర్లో ఉండి ఉంటే… అంటూ మొదలుపెట్టిన బుగ్గన… “కరోనా పై బాబు కత్తి యుద్ధం.. అర్థరాత్రి ఒంటి గంట వరకూ కరోనాపై బాబు సమీక్ష.. ఐరాసలో కరోనా పై బాబు ప్రజెంటేషన్.. పారిశుద్ధ్య కార్మికులు, అధికారులపై బాబు ఆగ్రహం.. కరోనాను బాబు జయించారు” అన్న వార్తల్ని ప్రచారం చేసుకునే వారన్నారు. మొత్తంగా తనదైన రీతిలో బాబును ఎటకారం చేసుకున్నారు బుగ్గన.
కాగా… లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ కు వెళ్లిన చంద్రబాబు.. అక్కడే ఉండిపోవటం.. ఏపీకి వస్తే క్వారంటైన్ లో ఉండాలి అని మంత్రుల నోట మాటలు రావడంతో అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు.. ఏపీకి రావొచ్చి అని ప్రభుత్వ విప్ చెప్పినా కూడా బాబు స్పందించకపోవడంతో… కావాలనే బాబు ఈ టైంలో తప్పించుకుని తిరుగుతూ.. తన ఆరోగ్యం తాను చూసుకుంటున్నారని… జనాలు మరిచిపోతారేమో అని, అప్పుడప్పుడూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనే కామెంట్లు వస్తోన్న సంగతి తెలిసిందే!