మాజీ మంత్రి వై.ఎస్.వివేకా హత్య కేసులో నిందితుడైన వై.ఎస్.భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం మరోసారి వాయిదా పడింది. ఈనెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌పై మంగళవారం రోజున సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సీహెచ్.రమేశ్‌బాబు విచారణ జరిపారు. భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది ఇ.ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ వివేకా హత్య విషయం తెలుసుకుని జనం లోపలికి వెళుతుండగా భాస్కర్ రెడ్డి వారిని నియంత్రిస్తూ వచ్చారన్నారు. అంతేగానీ రక్తపు మరకలను తుడిచివేయాలని చెప్పలేదన్నారు. సాక్ష్యాలను చెరిపివేయించారనడానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని తెలిపారు. ఆయనను నిరాధారంగా అరెస్ట్ చేశారన్నారు.
సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వివేకా హత్య కుట్రలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని తెలిపారు. ఆయన సూచనల మేరకే రక్తపు మరకలను తుడిచివేశానని పనిమనిషి వెల్లడించినట్లు తెలిపారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు భాస్కరరెడ్డి కుట్రలో భాగస్వామిగా ఉన్నారన్నారు. ఈనెల 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించిందని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకాలు సృష్టిస్తారన్నారు. భాస్కర్ రెడ్డి బయట ఉంటే సాక్ష్యమివ్వడానికి ఎవరూ ముందుకు రారని తెలిపారు.