తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడంతో రాజకీయం హీటెక్కింది. ఇక బీజేపీ నుంచి ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత రఘునందన్‌రావు గత నెల రోజుల నుంచే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపును తెలంగాణ మంత్రి హరీష్‌రావు తీసుకున్నారు.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ దుబ్బాక సీటును ఎవరికి ఇస్తుందన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది. వాస్తవానికి టీఆర్ఎస్ రామలింగారెడ్డి భార్యనే అభ్యర్థిగా ప్రకటించాలని చూస్తోంది. అయితే అదే సమయంలో ఆయన తనయుడు సైతం సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఆయనపై స్థానికంగా నెగిటివ్ ఉందన్న ప్రచారం కూడా టీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతోంది. అయితే ఇదే సమయంలో టీఆర్ఎస్ అధిష్టానానికి మరో తలనొప్పి కూడా వచ్చి పడింది. మాజీ మంత్రి దుబ్బాక నియోజకవర్గంలో మంచి పేరున్న చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి సైతం ఈ సీటుపై ఆశలు పెట్టుకోవడంతో పాటు ఇక్కడ తానే పోటీ చేస్తానని స్వయం ప్రకటనలు చేసుకుంటున్నారు.
ఎన్నికల సమయంలోనే తన తండ్రికి మంత్రి పదవి ఇస్తానని టీఆర్ఎస్ అధిష్టానం హామీ ఇచ్చిందని.. ఇప్పుడు తన తండ్రి లేకపోవడంతో ఆ సీటు తమకే ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ రామలింగారెడ్డి భార్య సుజాతకు సీటు ప్రకటిస్తే ఆయనకు శ్రీనివాస్ రెడ్డి వర్గం సహకరించదన్న అనుమానాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో గెలుపు ఓటములు రెడ్డి వర్గం డిసైడ్ చేయనుంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం ఇప్పుడు హరీష్ రావుకు సవాల్‌గా మారింది.
టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన మాత్రం శ్రీనివాస్ రెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి… వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని హామీ ఇచ్చి ఒప్పించేలా ఉందట. బీజేపీ మాత్రం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ సీటు ఇవ్వకపోతే తమ పార్టీలోకి ఆహ్వానించి సీటు ఇవ్వడంతో పాటు ఇక్కడ సీటు రేసులో ఉన్న రఘునందన్‌రావుకు మరో పదవి ఇవ్వాలన్న ప్లాన్‌తో ఉందట. ఏదేమైనా దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు పెద్ద సంకటంగానే మారింది.
-Surya