కరోనా ఎఫెక్ట్ విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల మీద కూడా పడింది. వచ్చే నెల 17 నుండి 25 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. అయితే కరోనా నేపధ్యంలో రోజూ పదివేల మందికి మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఆన్ లైన్ ద్వారానే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానంలోని అర్చక స్వాములకి, సిబ్బందికి కరోనా టెస్టులు తరచూ చేసేలా నిర్ణయం తీసుకున్నారు.
అలానే కృష్ణలో స్నానాలు చేసేందుకు, తలనీలాలు సమర్పించేందుకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి దర్శనం ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. మూలా నక్షత్రం రోజున భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉండడంతో ఆ రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించనున్నారు. రూ.100, రూ.300, ఉచిత దర్శనాలు అందుబాటులో ఉండనున్నాయి. ఎక్కడికక్కడ భౌతిక దూరం పాటించేలా గుర్తులు వేయనున్నారు.