నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను రేపు తీవ్ర తుపానుగా బలపడనుంది. ఈ క్రమం రేపు మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మరోవైపు తుపాను ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలో శనివారం రాత్రి నుంచే మొదలైన సంగతి తెలిసిందే.
మరోవైపు మిగ్‌జాం తుపాను మంగళవారం మధ్యాహ్నంలోగా నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో గంటకు 90-110 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో రాయలసీమ, కోసాంధ్రల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, బుధవారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుపాను నేపథ్యంలో పాఠశాలలకు స్థానిక సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.