జనసేన మా మిత్ర పక్షమే..త్వరలోనే పవన్ తో భేటీ అవుతానని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి తెలిపారు. ఇప్పటికే పవన్.. నాదెండ్ల మనోహరుతో ఫోన్లో మాట్లాడానని.. నాకు అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు నాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారని వివరించారు. ఏపీ అప్పులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సిద్దాంతపరంగా భావజాలం కుదరని పార్టీలతో విపక్షాల కూటమి ఏర్పడిందని.. బీజేపీని ఓడించేందుకే కూటమిగా ఏర్పడ్డారని వివరించారు.
కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులతో సహా గత ప్రభుత్వ హయాంలో రూ. 2.65 లక్షల కోట్ల మేరకు అప్పు చేశారని.. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో రూ. 7.14 లక్షల కోట్ల మేర అప్పు ఉందని ఆరోపణలు చేశారు. మద్యం ద్వారా ఆదాయం పైనా రూ. 8300 కోట్లు తెచ్చారని.. వైసీపీ ప్రభుత్వం రూ. 71 వేల కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 90 వేలు వస్తోందని తెలిపారు. డెవల్యూషన్ కింద కేంద్రం రూ. 35 వేల కోట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తోందని..40 శాతం వడ్డీలకే కడుతున్నారని పేర్కొన్నారు.