మా మూడు పార్టీల మూల సిద్ధాంతం ప్రజాసేవే : పురందేశ్వరి

-

ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూల సిద్ధాంతాలు ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యమని వివరించారు. వికసిత భారత్‌ బీజేపీ ధ్యేయమని.. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని పేర్కొన్నారు. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా జనసేనాని పవన్‌కల్యాణ్‌ తన గళం వినిపిస్తారని అన్నారు.

కేంద్రం ఏపీకి ప్రకటించిన హామీల్లో 93% వరకు పూర్తయ్యాయని పురందేశ్వరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్లే అమరావతి నిర్మాణం, విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు, పోలవరం నిర్మాణం వంటి విషయాల్లో జాప్యమవుతోందని పేర్కొన్నారు. ఏపీలో కొత్త ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం ముందుకొస్తే వైసీపీ సర్కార్ తామే ఏర్పాటు చేసుకుంటామని అడ్డుపడిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం వల్లే రైల్వేజోన్‌ పట్టాలెక్కలేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version