వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పిల్లలకు సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా తిరుమలేశుడి కొండకు వస్తున్నారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా భక్తులు తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించేదుకు కొండకు వస్తున్నారు. దీంతో రద్దీ పెరగడం వల్ల దర్శనానికి చాలా సమయం పడుతోంది.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు ఆదివారం రోజున శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వర స్వామి 81,927 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 29,196 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.28 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.