ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటూ ఈ హామీని అమలు చేసింది. ‘దీపం 2.0’ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. అయితే ఈ స్కీమ్ కింద తొలి గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగుస్తోందని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మార్చి 31 వరకే సమయం ఉందని వెల్లడించారు. మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ హామీని తమ సర్కార్ నిలబెట్టుకుందని మంత్రి అన్నారు. ఇప్పటి వరకూ 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లను వినియోగించుకున్నారని చెప్పారు. మరో ఐదు రోజులే గడువు ఉండటంతో ఈ పథకానికి అర్హులైన వారు తొలి గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటున్నారు.