కర్ణాటక ఆంధ్ర జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే నిర్వహణ లోపంతోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తలుపుల జీవితకాలం 45 ఏళ్లే ఉండగా.. 70 ఏళ్ల నుంచి ఆ గేట్లనే వాడుతున్నారు. ఈ క్రమంలోనే భారీ వరద పోటెత్తడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ప్రాజెక్టుల భద్రతకు ప్రభుత్వాలు నిధులివ్వకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని విమర్శలు వస్తున్నాయి.
కొట్టుకుపోయిన తుంగభద్ర క్రస్ట్ గేటు పునర్నిర్మాణానికి కనీసం వారం రోజులు పడుతుందని కర్ణాటక జలవనరులశాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. క్రస్ట్ గేటు కొట్టుకుపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియవన్న ఆయన.. గేటు, ఇనుప గొలుసు నడుమ చేసిన వెల్డింగ్ దెబ్బతినడంతో ఈ ఘటన చోటుచేసుకుందని ఇంజినీర్లు చెబుతున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు విమర్శించుకునే సమయం కాదని.. ముందుగా రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని డీకే అన్నారు. జలాశయంలో కనీసం 53 టీఎంసీల నీరు నిల్వ చేసుకుని గేటు పునర్నిర్మాణ పనులు చేపట్టాలని ఇంజినీర్లను ఆదేశించినట్లు తెలిపారు.