ఈ మధ్య కాలంలో విద్యార్థినిల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు రెండు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. బాసర ఐఐఐటీలో విద్యార్థిని స్వాతి ఆత్మహత్య చేసుకోగా.. ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెన్ను విషయంలో స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదం నేపథ్యంలో ఓ విద్యార్థిని భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
బొల్లపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలోని ప్రైవేటు కళాశాల హాస్టల్ లో ఉంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం ఉదయం హాస్టల్ లో ఉన్న సమయంలో స్నేహితురాలుతో పెన్ను విషయంలో స్వల్ప వివాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అనూష హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకింది. హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించిందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.