ఔను! ఇప్పుడు దళితుల్లోనే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. జగన్ సర్కారుపై స్వరం పెంచుతున్నారు. జగన్ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. `నీకు సిగ్గు, శరం, దమ్ము` అనేవి ఉంటే అంటూ.. విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలను ఏకరువు పెడుతున్నారు. వారికి న్యాయం జరగలేదని చెబుతున్నారు. రూ.10 లక్షలు ఇస్తే.. ముష్టి వేస్తారా? అని కూడా నిలదీస్తున్నారు. ఇలా మొత్తానికి తన మనసులో ఉన్న ఆందోళనను, ఆవేదనను కూడా హర్షకుమార్ వెల్లడిస్తున్నారు.
అయితే, ఈ హర్షకుమార్ ఆవేదన వెనుక ఏముంది? అసలు ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు దళితులను లీడ్ చేసే నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. గతంలో అయితే.. కారెం శివాజీ, ప్రభాకర్ వంటి వారు ఉంటేవారు. అదే సమయంలోమందకృష్ణమాదిగ కూడా చక్రం తిప్పేవారు. వీరంతా కూడా దళితుల హక్కుల కోసం పోరాటం అంటూ ప్రభుత్వాలపై యుద్ధాలు ప్రకటించడం. తర్వాత ప్రభుత్వాలతో రాజీ పడడం (గతంలో ఇలానే జరిగాయని సీఎంల స్థాయిలో విమర్శలు వచ్చాయి. మందకృష్ణమాదిగపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలానే వ్యాఖ్యానించారు.) జరిగేది.
కానీ, ఇప్పుడు కారెం శివాజీ.. ప్రభాకర్‌లు ఇద్దరూ కూడా జగన్‌కు అనుకూలంగా మారారు. ఇద్దరూ కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. వీరిద్దరు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో పదవులు పొందిన వారే. ఇప్పుడు పార్టీ మారడంతో వీరు కూడా కండువా మార్చేశారు. వీరు సామాజిక వర్గాల పరంగా పట్టున్న నేతలే అయినా ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రాజీపడక తప్పదు. దీంతో దళితులను లీడ్ చేసే నాయకుడు లేకుండా పోయారు. ఈ క్రమంలో దళితులకు తాను ఐకాన్‌గా మారాలనే ఏకైక లక్ష్యం పెట్టుకున్నట్టు హర్షకుమార్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
అదే సమయంలో ఆయన అవకాశం దక్కితే.. ఏదో ఒక పార్టీ పంచన చేరేందుకు కూడా వెనుకాడరని ఆయనతో ఉన్న ఆయన అనుచరులే చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఎన్నిలకు రా! అని పిలుస్తుండడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని, దీనివెనుక చాలానే గూడు పుఠాని జరుగుతోందని చెబుతున్నారు. ఏదేమైనా .. దళితులను అడ్డుపెట్టుకుని గతంలో కొందరు ఎదిగినట్టే.. ఇప్పుడు హర్షకుమార్ కూడా అదే తరహాలో ముందుకు సాగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి హర్షకుమార్ అసలు ప్లాన్ ఏంటో ? చూడాలి.