ఎండలతో మండిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖాధికారులు ఓ చల్లని వార్తను చెప్పారు. ఎండలు , ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని చెప్పడంతో వారు ఈరోజే వర్షం పడినంత సంబరపడిపోతున్నారు. ఏపీలోని ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కర్ణాటక మీదుగా …పశ్చిమ విదర్భ పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఓ ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి కూడా వ్యాపించిందని అధికారులు వివరించారు. ఈ ద్రోణుల ప్రభావం వల్ల బుధవారం అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి,ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు . ప్రకాశం జిల్లాలో అక్కడక్కడు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.