అమరావతి: ప్రభుత్వం, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులపై సంచలన ఆరోపణలు చేశారు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ. అవినీతి అధికారులను ప్రభుత్వం వెనకేసుకొస్తున్నట్టుగా కన్పిస్తోందంటూ విరుచుకుపడ్డారు. ఉన్నతాధికారులను ప్రశ్నిస్తోన్న ఎస్సీ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారంటూ కేఆర్ విమర్శలు చేశారు.
సంబంధిత ఉన్నతాధికారులపై అట్రాసిటి కేసు పెడతామని హెచ్చరించారు. బాధలు చెప్పుకుందామంటే మంత్రి బుగ్గన అందుబాటులో లేరంటూ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న నియామకాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు. వాణిజ్య పన్నుల శాఖ విశాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు బడ్జెట్ ఇవ్వలేదన్నారు. బడ్జెట్ లేకున్నా కార్పోరేట్ ఆఫీస్ హంగులతో కార్యలయాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
బడ్జెట్ కేటాయింపు లేకుండా ఏర్పాటు చేసిన ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి బుగ్గన, ఉన్నతాధికారులు వెళ్లారని..కార్యాలయం ఏర్పాటుకు వసూళ్లు చేశారంటూ ఆరోపణలు వచ్చాయన్నారు. దీనిపై ఉన్నతాధికారి సుధాకర్ సహా ఐదుగురుపై ఆరోపణలు వచ్చాయన్నారు. కానీ కింది స్థాయిలో ఉన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారని.. ఏ-1గా ఉన్న విశాఖ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సుధాకర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? అని ప్రశ్నించారు.
దొంగతనం చేసిన అధికారులను వదిలి ఉద్యోగులపై అకారణంగా చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు కేఆర్. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు తప్పు చేసిన వాళ్లను వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రి బుగ్గనకు చెబుదామంటే అందుబాటులో ఉండడం లేదన్నారు. మంత్రి బుగ్గన కార్యాలయంలో కూడా బాధ్యాయుతమైన వ్యక్తులు లేరన్నారు. మేమిక ఎవ్వరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు కేఆర్ సూర్యనారాయణ.