ఆరోగ్య సురక్ష లో భాగంగా ఈ నెల 15 నుంచి వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ చరిత్ర లో మరో గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌జగన్ మోహన్‌రెడ్డి గారు శ్రీకారం చుట్టారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు.
మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం మంత్రి విడదల రజిని గారు వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జగనన్న ఆరోగ్య సురక్ష పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని గారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఆరోగ్య భరోసా దక్కుతుందని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించడం, అవసరమైనవారికి గ్రామాల్లోనే క్యాంపులు నిర్వహించి వైద్యం అందించడం, పెద్ద ఆస్పత్రులకు సిఫారుసు చేయడం లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారు తీసుకొచ్చారని వెల్లడించారు.