బాధ భయం ఆక్రోశం ! అయ్యో జేసీకి ఎంత కష్టమొచ్చిందో ? 

-

రాజకీయ ఉద్దంఢుడిగా, సీనియర్ నాయకుడు గా పేరుగాంచిన, అనంతపురం జిల్లా నాయకుడు జెసి దివాకర్ రెడ్డి పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు గా తయారయ్యింది. అసలు ఆయన మొదటి నుంచి ఏ పార్టీలో ఉన్నా, వివాదాస్పద నేతగానూ, అసంతృప్తి నాయకుడిగానూ ముద్ర వేయించుకున్నారు. సొంత పార్టీ నాయకులను సైతం ముక్కుసూటిగా విమర్శిస్తూ, తాను ఎవరికీ ఆదరను, బెదరను అన్నట్లుగా వ్యవహరించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో కానీ, జేసీ హవాకు అడ్డు లేకుండా ఉండేది. మొన్నటి టిడిపి ప్రభుత్వంలో ఆయన ఎంపీగా గెలిచి తన హవాకు ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. ఎప్పుడైతే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి జేసీ బ్రదర్స్ దివాకరరెడ్డి, ప్రభాకరెడ్డి  పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
వారి వ్యాపారాలను, గతంలో వారిపై నమోదైన కేసులను అన్నిటినీ తవ్వి తీస్తూ, ఎక్కడికక్కడ చెక్ పెట్టుకుంటూ జగన్ వస్తున్నారు. పదవులు లేక, వ్యాపారాలు దెబ్బతిని, కేసులు చుట్టుముట్టడంతో జేసీ బ్రదర్స్ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.ఆ ఇబ్బందులు పడుతూనే, మౌనంగా ఉంటూ వచ్చిన దివాకర్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చి మరి తన బాధను, జగన్ పై ఉన్న కోపాన్ని వెళ్లగక్కారు.” కుటుంబంతో దూరంగా ఉంటున్నా, భార్య చెల్లి పేరుతో గనులు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తో పాటు, ఇతర నేతల భార్యల పేరుతో గనులు ఉన్నా, నా గనులను మాత్రమే శోధించారు.

వ్యక్తిగతంగా నాకు కుటుంబంపై కక్ష సాధించేందుకు ఇదంతా చేశారు. ఇప్పటికే నా కుటుంబాన్ని అన్ని రకాలుగా బాధించారు. నా తమ్ముడిని లోపల వేశారు. కేసులన్నీ కక్షసాధింపు లో భాగమే ” అంటూ జేసీ దివాకర్ రెడ్డి తాను పడుతున్న ఇబ్బందులను మీడియా ముఖంగా చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్ తన జోలికి ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని కూడా జెసి చెప్పుకొచ్చారు. ” బహుశా నేను ఎప్పుడూ, జగన్ మా వాడు మా వాడు అంటున్నా కదా, ఆ కారణం వల్ల కావచ్చు. నన్ను ఇంతవరకు ఏమీ చేయలేదు. గనులను మూసివేసేందుకు స్కెచ్ లు వేస్తున్నారు.

ఈ గనులు తప్ప ఇతర ఆస్తిపాస్తులు ఏవీ నాకు లేవు. అందులో వచ్చే ఆదాయంతో నేను అన్నం తింటున్నాను. వాటిని కూడా లేకుండా చేసి, తినడానికి తిండి లేకుండా మాడ్చి చంపడానికేనా ఇదంతా ? పర్మిట్లు తీసుకుందాం అనుకుంటే .. మీ నాయకుడు కి చెప్పు మీ అబ్బ కు చెప్పు అన్నట్లుగా ఆఫీస్ నుంచి వెళ్లారు” అంటూ జెసి వెటకారం సైతం చేశారు. నా భార్యకు పెరాలసిస్. నడవలేని పరిస్థితి, పర్మిట్ల కోసం మరోసారి వస్తాను. అక్కడే కూర్చుంటా. మైనింగ్ కు పర్మిట్ ఇవ్వకుంటే అన్నం లేకుండా మాడి పైకి పోతాం. నాకు నా భార్యకి వయస్సు అయిపోయింది. వాళ్ళ కోరిక కూడా నెరవేరుతుంది.

ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేస్తా ! పోలీసులు సత్కారం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎన్నో సత్కారాలు అనుభవించిన పెద్దవాడిని, అందరికీ చెబుతున్నా, మీరు నాకు సత్కారం చేస్తారు. అందుకు రెట్టింపు సత్కారం కూడా మీకు ఏదో ఒక రోజు వస్తుంది. నాకు సత్కారం చేసే పెద్ద వాళ్ళకు సత్కారం చేసి మా రుణం తీర్చుకుంటాము. ఇంతకంటే ఘనమైన సత్కారం తీసుకోక తప్పదు” అంటూ మనసులోని బాధను జేసీ వెళ్లగక్కారు.

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version