వేసవి కాలం సెలవులు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లూ స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసు వర్కులతో బిజీబిజీగా ఉన్న వాళ్లంతా ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. తరలివస్తున్న భక్తుల కోసం టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు శనివారం రోజున భక్తులు పోటెత్తారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు సమయం పట్టింది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,139 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 39,849 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల వేంకటేశ్వరుడికి నిన్న హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వేసవి కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.