ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో జగన్ కి దగ్గరి బంధువైన బాలినేనికి రెండోసారి అవకాశం కల్పిస్తారని అంతా భావించారు.కానీ జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. తుది జాబితాలో తన పేరు లేకపోవడంతో బాలినేని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఒకానొక దశలో ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే సజ్జల రామకృష్ణా రెడ్డి తదితర పెద్దలు బాలినేనిని బుజ్జగించారు. ఈ క్రమంలో సీఎం జగన్ స్వయంగా బాలినేనిని స్వయంగా క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని.. మంత్రి పదవి రాకపోవడంతో కాస్త బాధ పడ్డ విషయం నిజమేనని.. కానీ రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.
అంతేకాకుండా ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ తో తనకు ఎప్పుడూ విభేదాలు లేవని మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయన్నారు. సీఎం జగన్ ఏ బాధ్యతలు అప్పగించిన నిర్వహిస్తానని చెప్పారు. అయితే తాజాగా మంత్రి పదవి పోవడంపై బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు చాలా బాధపడ్డానని.. తాను గతంలో మంత్రి పదవి వదులుకొని వైసీపీలోకి వచ్చానని ఆయన గుర్తు చేశారు. మూడేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంజాయ్ చేశారని.. కార్యకర్తలను ఇబ్బందిపెట్టే ఎమ్మెల్యేలను సహించని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. తనపై సీఎంకు ఫిర్యాదులు చేసినా భయపడనని.. మంత్రి పదవి అడిగాను కానీ సురేష్ కు మంత్రి పదవి ఇవ్వద్దని చెప్పలేదని బాలినేని వెల్లడించారు.