రాష్ట్రంలో చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాధినేతగా జగన్ బాగానే ఉన్నా.. మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా.. అడుగడు గునా ఆయన ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతున్నారు. అదేసమయంలో కోర్టుల నుంచి కూడా తీవ్ర వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. నిజంగానే ప్రతిపక్షాలు విమర్శించినట్టు జగన్ తప్పులు చేస్తున్నారా? లేక.. ఆయన టీమ్‌లో ఉన్న కొందరు అత్యుత్సాహం వల్ల జగన్ మాటలు పడుతున్నారా? టార్గెట్ అవుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హైకోర్టు మరోసారి ప్రభుత్వానికి తలంటింది. అదేసమయంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని టార్గటె్ చేశాయి.
దీంతో చేయని తప్పులకు జగన్ టార్గెట్ అవుతున్నారనే వాదన వైసీపీ సానుభూతి పరుల నుంచి వినిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పేదలకు బియ్యం పంచాలనే మంచి నిర్ణయంతో ముందుకు వెల్లారు. అయితే, ఆయన వేసిన అడుగులు తీవ్ర వివాదం అయ్యారు. ఆయన ర్యాలీగా బియ్యాన్ని తీసుకువెళ్లి.. మండలాలకు పంపించడాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేశాయి. అదేవిధంగా బెంగళూరు వెళ్లిన కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ కూడా లాక్డౌన్ సమయంలో దాదాపు 50మంది అనుచరులతో తిరిగి తన నియోజకవర్గంలో ప్రవేశించారు.
దీనిని కొందరు ఉత్సాహవంతులు పనిగట్టుకుని హైకోర్టులో పిల్ వేయడం. దీనిపై విచారించిన కోర్టు.. ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఇప్పుడు జగన్ టార్గెట్ అయ్యారనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకులు కూడా లాక్డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరవడాన్ని తప్పుబట్టాయి. కానీ, కేంద్రం నిర్ణయం మేరకు రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. ఇదేసమయంలో జగన్ సంబంధిత షాపుల ఓపెన్‌కు సంబంధించి ఖచ్చితమైన సూచనలు చేశారు. ప్రతి షాపు వద్ద కేవలం ఐదుగురు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని, మాస్కులు విధిగా ధరించిన వారికే మద్యం అమ్మాలని ఆయన షరతు పెట్టారు.
అయినాకూడా ఈ విషయంలో అధికారులు కానీ, పోలీసులు కానీ, దుకాణాల్లో(ప్రభుత్వానివే అయినా) అమ్మేవారు కానీ పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ విషయాన్ని టార్గెట్ చేసుకుని జగన్ విమర్శలు చేస్తున్నాయి. ఈ పరిణామాల్లో జగన్ ప్రమేయం కానీ, జగన్ కు సంబంధం కానీ లేదు. కానీ, కొందరు చేస్తున్న అత్యుత్సాహంతో ఆయన టార్గెట్ అవుతున్నారనేది వాస్తవం. మరి మున్ముందైనా ఆయన ఇలాంటి వారికి ముకుతాడు వేస్తారో లేదో చూడాలి.