ఇటీవల అల్లు అర్జున్ పై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తనకు తెలియదని.. ఉన్నదంతా మెగా ఫ్యాన్స్ మాత్రమేనని అన్నారు బొలిశెట్టి. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా షామియానా కంపెనీ తరహాలో పెట్టుకుంటే అది మాకు సంబంధంలేని విషయం అని అన్నారు. అల్లు అర్జున్ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారని.. ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని వార్నింగ్ ఇచ్చారు బొలిశెట్టి.
దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ విషయంపై నేడు మీడియా ఆయనని మరోసారి ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను మళ్ళీ అల్లు అర్జున్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని అన్నారు. మొన్న ఆయన మాట్లాడితేనే మాట్లాడాను.. మళ్లీ మాట్లాడితే కౌంటర్ ఇస్తానని అన్నారు. అంతేకానీ తనకు, తన పార్టీకి అల్లు అర్జున్ తో ఎటువంటి శత్రుత్వం లేదన్నారు.
ఇక మరోవైపు జనసేన పార్టీ గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. “అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా..? నువ్వు ఓ కమెడియన్. డిసెంబర్ నెలలో నీ సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తా. కనీసం నీ ఫ్లెక్సీలు కట్టే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరూ లేరు. మెగా ఫ్యామిలీ అండతోనే నువ్వు సినిమాల్లోకి వచ్చావు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదు”. అని ఫైర్ అయ్యారు.