గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి వచ్చినా… తప్పులొప్పుకునే పనికి టీడీపీ నేతలు పూనుకోవడంలేదు. తమ పాలనలో కొన్ని పొరపాట్లు జరగబట్టి ప్రజలు తమకు గట్టిగా బుద్ది చెప్పారు.. ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయనేది విశ్లేషించుకున్నాం.. కార్యకర్తలకు భరోసానిస్తున్నాం.. మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. అని ఇప్పటికీ టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారు. చింతచచ్చినా పులుపుచావని మాటలు మాట్లాడుతున్నారు! ఇందులో భాగంగా మైకందుకున్నారు కళా వెంకట్రావు!
తాజాగా జగన్ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధించ మొదలుపెట్టిన కళా వెంకట్రావు… సంక్షేమం హామీలతో బడుగు బలహీన వర్గాలను రోడ్డున పడేశారని.. అన్న క్యాంటీన్లను నిలిపివేశారని.. ప్రతీ పిల్లవాడికీ అన్న అమ్మఒడి వంచనకు కేరాఫ్ అడ్రస్ అయిందని.. ఆదుకోవాల్సిన సమయంలో ఆర్థిక భారాలు మోపుతున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం “సెల్ఫ్” స్టార్ట్ చేసిన కళా వెంకట్రావు… గతంలో తమ పాలన అద్భుతః అంటున్నారు!
గత టీడీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని.. అవినీతి రహిత పాలనకు అర్ధంలా మారిందని.. ఇక సంక్షేమ విషయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేననే మాటలు చెబుతున్నారు కళా వెంకట్రావు. టీడీపీ హయాంలో బర్త్ టూ డెత్ సంక్షేమం అమలుచేశామని ఇంకా బొంకుతున్నారు!! నిజంగా అదే జరిగి ఉంటే… నేడు ఈ పరిస్థితి టీడీపీకి వచ్చి ఉండేదా? ప్రజలనుంచి ఆ రేంజ్ లో తిరస్కరణకు గురయ్యేవారా? గతం “కళా” మరిచినా… అది “కల” కాదన్న విషయం జనం మరిచిపోవడంలేదు కదా!
దీంతో ఇప్పటికైనా టీడీపీ నేతలు వాస్తవాల్లో బ్రతకాలని.. బొంకడాలు మానుకోవాలని.. అవకాశం ఉంటే ప్రజలను క్షమాపణ అడగాలి తప్ప ఇలాంటి మాటలు మానుకోవాలని పలువురు సూచిస్తున్నారు!!