చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తన అసహనం చూపించారు. అప్పుడెప్పడో సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీకి చురకలు అంటిస్తూ చెలరేగిపోయారు. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఆయన తాజాగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈసారి ప్రత్యక్షంగానే తన అసహనాన్ని చూపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగే ” అజాదీ కా అమృత్ మహోత్సవ్” కమిటీ భేటీలో పాల్గొనేందుకు చంద్రబాబు దిల్లీ వెళ్లారు. దిల్లీలో ఆయనకు ఎంపీలు స్వాగతం పలికారు. ఇలా స్వాగతం పలికిన వారిలో కేశినేని నాని కూడా ఉన్నారు. ఈ సమయంలో ఫ్లవర్ బొకేను కేశినేని నాని చేతుల మీదుగా ఇప్పించాలని ఎంపీ గల్లా జయదేవ్ ప్రయత్నించారు. బొకేను ఆయన చేతికి ఇవ్వబోయారు. అయితే కేశినేని నాని ఆ బొకేను విసురుగా నెట్టేశారు. దీంతో గల్లా జయదేవ్ నే బొకే ఇచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కేశినేని నాని కుటుంబంలో విభేదాలు వచ్చాయి. కేశినేని నాని సోదరుడు శివనాథ్ విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఆయనను ప్రోత్సహిస్తున్నారని కేశినేని నాని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబుపై అసహనంతో ఉన్నారని చెబుతున్నారు. కొద్ది రోజుల కందట మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేసినప్పుడు చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. వాటిని ఆయన ఖండించలేదు.
కేశినేని నాని చాలా కాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో ఆయనకు సఖ్యత లేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన బలంతో గెలుస్తామని .. ఏకపక్షంగా టీడీపీ తరపున ఆయన కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత కూడా ఆయన అదే తీరును కొనసాగిస్తుండటంతో టీడీపీ నేతల్లోనే ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది.