కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులపై మూక దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హాస్టళ్లపై దాడులు జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిజ్‌స్థాన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానికులకు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ తర్వాత అల్లరి మూకలు విదేశీ విద్యార్థులపై దాడులు చేయడం ప్రారంభించాయి. వారు ఉంటున్న మెడికల్ విశ్వవిద్యాలయాల వసతిగృహాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి.
కిర్గిజ్‌స్థాన్‌లో భారత్‌కు చెందిన విద్యార్థులు సుమారు 14,500 వరకు ఉన్నట్లు సమాచారం. పశ్చిమగోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కొంతమంది తెలుగు విద్యార్థులు వైద్య విద్య చదివేందుకు అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతం నుంచి సుమారు 15 మంది విద్యార్థులు కిర్గిజ్ రష్యన్ స్లావిక్ విశ్వవిద్యాలయం, మరికొన్ని వర్సిటీల్లో చదువుతున్నారు. మరోవైపు బిష్కెక్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉండాలని భారత కాన్సులేట్ సూచించింది. భారత రాయబార కార్యాలయంతో నిత్యం అందుబాటులో ఉండాలని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సూచించారు.