అమెరికాలో ఉద్యోగం..అంటూ యువతులను నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకోవడం..మోజు తీరిన తర్వాత ముఖం చాటేస్తున్న నిత్య పెళ్లికొడుకును గుంటూరు దిశ పోలీసులు అరెస్ట్ చేశారు.
“పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందకూరు గ్రామానికి చెందిన కర్నాటి సతీశ్‌బాబు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి గుంటూరు రవీంద్రనగర్‌కు చెందిన శ్రీలక్ష్మిని ఈ ఏడాది జూన్ 16న వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత రూ.80లక్షలు కావాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే పడక గదిలో సన్నిహితంగా మెలిగిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో పెడతానంటూ బెదిరించాడు. సతీశ్‌బాబు ఇతర మహిళలతో చేసిన చాటింగ్ శ్రీలక్ష్మి చూసింది. తనను పెళ్లి చేసుకొని మోసగించాడని, గతంలో పలువురు మహిళలతో అతడికి వివాహం జరిగినట్లు గుర్తించింది. సతీశ్‌బాబుతో పాటు అతని తల్లిదండ్రలు కూడా తనను మోసం చేశారంటూ బాధితురాలు మమ్మల్ని ఆశ్రయించింది.” అని దిశ ఏఎస్పీ సుప్రజ, సీఐ సురేశ్ బాబు తెలిపారు.
‘సతీశ్‌బాబు 2005లో విశాఖపట్నానికి చెందిన శైలజను తొలి వివాహం చేసుకున్నాడు. 2014లో అమెరికాలో లావణ్యను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు 2017లో విడాకులు ఇచ్చాడు. మళ్లీ అదే ఏడాది నరసరావుపేటకు చెందిన లక్ష్మిని మూడో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మితో మనస్పర్థలు రావడంతో 2019లో ఆమె గుంటూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమెతో విడాకులు తీసుకోకుండానే అదే సంవత్సరం నెల్లూరుకు చెందిన దివ్యను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు అసలు విషయం తెలిసి 2021లో గుంటూరు దిశ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.’ – సీఐ సురేశ్ బాబు
ఈ విషయాలన్నీ దాచిపెట్టిన సతీశ్‌బాబు శ్రీలక్ష్మిని ఐదో వివాహం చేసుకున్నాడు. కొద్దికాలానికి సతీశ్‌బాబు అసలు స్వరూపం తెలియడంతో దిశ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీలక్ష్మి కంటే ముందు పలువురు మహిళలను పెళ్లి చేసుకున్నాడని, వారికి విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నట్టు గుర్తించారు. నిందితుడు సతీశ్‌బాబు, అతని తండ్రి వీరభద్రరావును గురువారం చుట్టుగుంట వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడు ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చినట్లు చెప్పారు.
“ఇతగాడికి బట్టతల కావడంతో ఆవిషయం బయటపడకుండా విగ్గుపెట్టి నమ్మించే యత్నం చేస్తాడు. పెళ్లిపీటలపై జిలకర్రబెల్లం పెట్టే క్రమంలో యువతి గుర్తిస్తే తనకు కొద్దిరోజుల కిందట చర్మవ్యాధి రావడంతో జుట్టు ఊడిపోయిందని త్వరలో వచ్చేస్తుందంటాడు. పెళ్లి చేసుకొని అందమైన భవంతిలో సకలభోగాలతో నెల, రెండు నెలలు కాపురం చేస్తాడు. ఆ మహిళల వీడియోలు చరవాణిలో తీసుకుంటాడు. అమ్మాయి అభ్యంతరం చెబితే మాయమాటలు చెప్పి తాను అమెరికా వెళ్లినప్పుడు ఈ గుర్తులు చూసుకోవడానికంటూ ఏమార్చుతాడు. ఆ తర్వాత అమెరికా చెక్కేస్తాడు. ఈ క్రమంలో కొందరు మహిళలు అతని గురించి తెలుసుకొని ప్రశ్నిస్తే డబ్బులిచ్చి సెటిల్‌మెంట్ చేసుకుంటాడు. పట్టుబట్టిన వారికి విడాకులు ఇచ్చేస్తాడు. పోలీసు కేసు పెడతామని చెబితే వారి నీలి చిత్రాలు, వీడియోలు బయటపెడతానంటూ బెదిరిస్తుంటాడు.” అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.