వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు వంద సేవలు పౌరులకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు సీఎంకు ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ వివరించారు. అలాగే 90 రోజుల్లో విద్యార్థులు క్యూఆర్ కోడ్ ద్వారా తమ విద్యార్హత ధృవీకరణ పత్రాలు పొందేలా కూడా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులు వేగవంతంగా చేస్తున్నామని వివరించారు. మార్చి నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు.
డిజిటల్ సంతకం ఉన్న ధృవీకరణ పత్రాలు భౌతికంగా సమర్పించాల్సిన అవసరంలేదనే నియమనిబంధనలున్నప్పటికీ అధికారుల్లో చాలా మందికి అవగాహన లేకపోవడంతో విద్యార్థులను, ఇంటర్వ్యూ లకు వచ్చే అభ్యర్థులను ఫిజికల్ సర్టిఫికెట్లు పొందుపరచాలని చెప్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన ప్రజలు, అధికారులు అందరికీ అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. డాటా మొత్తం అనుసంధానించడం ద్వారా పాలనలోనూ, పథకాల అమలులోనూ పారదర్శకత పెరుగుతుందని, తద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని సీఎం అన్నారు.