వైద్య ఆరోగ్య రంగంలో ఫార్మాసిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చదువులో సత్తా చాటిన విద్యార్థులు, బోధనలో ప్రతిభచూపిన కళాశాలల ప్రిన్సిపాళ్లు, కోవిడ్ సమయంలో కష్టపడి పనిచేసిన ఫార్మాసిస్టులకు గురువారం గుంటూరు ప్రభుత్వ కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మొత్తం 240 మందికి ఈ సన్మానం జరిగింది. కార్యక్రమానికి మంత్రి విడదల రజిని గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మద్దాలిగిరి గారు, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ షాజిల గారు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని గారు మాట్లాడుతూ ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌కు పూర్తి స్థాయిలో కమిటీ గత 15 ఏళ్లుగా లేదని, ఫార్మసీ కౌన్సిల్ ను గత ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకుండా వదిలేసిందని మంత్రి గారు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 15 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి కమిటీని నియమించామని చెప్పారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఇంత గొప్ప సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.