కుర్చీ నీదా… నాదా… వైసీపీలో ఫైట్‌…!

-

ఒక ఒర‌లో రెండు క‌త్తులు.. ఒకే కుర్చీలో ఇద్ద‌రు నేత‌లు సాధ్య‌మేనా ?  కానేకాదు. కానీ, రాష్ట్రంలో మారిన రాజ‌కీయాల నేప‌థ్యంలో ఒకే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గెలిచిన అభ్య‌ర్థి, ఓడిన అభ్య‌ర్థి కూడా ఒకేపార్టీలో ఉండ‌డం చిత్రంగా ఉన్నా.. గ‌త చంద్ర‌బాబు హ‌యాం నుంచి ఇది సాగుతోంది. ఆయ‌న వైసీపీత‌ర‌ఫున గెలిచిన 23మంది ఎమ్మెల్యేల‌ను త‌న సైకిల్ ఎక్కించుకుని ఈ కొత్త సంస్కృతికి బీజం వేశారు. ఈ క్ర‌మంలో.. ఈ సూత్రాన్నే వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా పాటిస్తున్నారు. దీంతో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిపోయిన వైసీపీ నేత‌ల‌కు.. టీడీపీ త‌ర‌ఫున గెలిచి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న‌వారికి మ‌ధ్య షింక్ కావ‌డం లేదు.

ఇప్ప‌టికే ఈ త‌ర‌హా వివాదం.. గ‌న్న‌వ‌రంలో చోటు చేసుకుంది. ఇక్క‌డ గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వంశీని జ‌గ‌న్ పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే, ఇక్క‌డ నుంచి ఓడిపోయిన వైసీపీ నాయ‌కుడు, ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన మ‌రో నాయ‌కుడు వంశీతో చేతులు క‌లప‌లేక పోతున్నారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించలేకే వైసీపీ అధినేత‌కు త‌ల బొప్పిక‌డుతోంది. అయితే, ఇప్పుడు గుంటూరు వెస్ట్‌లో ఇలాంటిదే మరో కుంప‌టి ఎదురైంది. ఇక్క‌డ నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని టీడీపీ అభ్య‌ర్థి, తొలిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మ‌ద్దాలి గిరి విజ‌యం సాధించారు. ఇక‌, వైసీపీ అభ్య‌ర్థి, మాజీ పోలీసు అధికారి ఏసుర‌త్నం ఓడిపోయారు. అయితే, త‌ర్వాత .. రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లో భాగంగా గిరిని జ‌గ‌న్‌.. త‌న‌వైపు తిప్పుకొన్నారు.

ఈ క్ర‌మంలోనే ఏసుర‌త్నం, గిరిల మ‌ధ్య వివాదాలు రాకుండా చూసేందుకు ర‌త్నానికి.. మార్కెట్ యార్డు చైర్మ‌న్ గిరీ ఇచ్చారు. దీంతో కొన్నాళ్లు ఇద్ద‌రునేత‌లు చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల కాలంలో మ‌ద్దాలి గిరి అనుచ‌రులు ఫ్లెక్సీ రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. ఎమ్మెల్యే క‌మ్‌.. వైసీపీ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ కూడా గిరేన‌ని వారు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప‌రిణామం ఏసుర‌త్నానికి కంటిపై కునుకులేకుండా చేస్తోంది. వైసీపీ నుంచి పోటీ చేసిన తమ నాయకుడే ఇన్‌చార్జి అవుతారని, ఎమ్మెల్యే తన స్వార్ధం కోసం పార్టీలో చేరారని ఏసుర‌త్నం వ‌ర్గానికి చెందిన నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అయితే, దీనిపై ఒకింత ఘాటుగానే స్పందించిన‌.. ఎమ్మెల్యే వ‌ర్గం.. అధిష్టాన వర్గమే ఎమ్మెల్యే గిరిని పార్టీలో చేర్చుకుందని ఆయనే ఇన్‌చార్జి అవుతారంటూ చెప్పుకొంటున్నారు. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య ఇంచార్జ్ పీఠం కోసం భారీ రేంజ్‌లో కొట్లాట జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇన్‌చార్జి పదవి ఎవరిదనే విష‌యాన్ని అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు ఓ వర్గం సిద్ధమవుతోంది. మొత్తానికి అవ‌స‌రం లేకున్నా టీడీపీ నుంచి నేత‌ల‌ను చేర్చుకున్న జ‌గ‌న్‌కు తీవ్ర త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version