ఏడాదికి 30 వేల కోట్ల రూపాయల అప్పును ఎత్తే వెసులుబాటును కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించిందని, అయితే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం మూడు నెలల వ్యవధిలోని 70% నిధులను అప్పు రూపంలో తీసుకుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇక ఈ ఆర్థిక ఏడాది మొత్తం మిగిలిన నిధులతో ఎలా సర్దుబాటు చేసుకుంటూ వస్తుందనేది తనకు అంతు చిక్కడం లేదని రఘురామకృష్ణ రాజు గారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సీపీయస్ రద్దు చేశామని తమ ప్రభుత్వం ప్రకటించిందని, ఓపిఎస్ అమలు కోసం మాత్రమే సీపీయస్ ను రద్దు చేయమని ఉద్యోగులు కోరారని, కానీ ఓపిఎస్ స్థానంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు జీపీయస్ ను తీసుకువచ్చారని, గ్యారెంటీ లేని గ్యారెంటీ పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారిని కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు పొగిడిన విధానం చూస్తే, ప్రొఫెషనల్ భజన బృందం చిన్నబోతుందని అనిపించిందని అన్నారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చి ఓపీయస్ ను అమలు చేస్తామంటే, కాదు… మాకు జీపీయస్ మాత్రమే కావాలేనంతగా జగన్ మోహన్ రెడ్డి గారిపై కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు ప్రశంసలు కురిపించారని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.