పులివెందులలో సీఎం జగన్ ఓటమి తప్పదంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ రఘురామకృష్ణ రాజు. రానున్న ఎన్నికల్లో పులివెందులలో మా అధ్యక్షుడే ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏమిటోనన్న ఆందోళన క్రమశిక్షణ కలిగిన తనలాంటి కార్యకర్తలను వేధిస్తోందని చురకలు అంటించారు. పులివెందుల పులి రానున్న రోజుల్లో మ్యావ్ మ్యావ్ అనే పిల్లిగా మారుతుందేమోనని… ఇప్పుడు గాండ్రించే పులి కాస్త రేపు మ్యావ్… మ్యావ్ అంటుందేమోనని చెప్పారు.
వై నాట్ కుప్పం అని పోలీసులను అడ్డం పెట్టుకొని తింగరి వేషాలు వేస్తే తోలు తీసే పరిస్థితి వస్తుందని నిన్నటి పులివెందుల సభ ద్వారా స్పష్టమయ్యిందని అని పేర్కొన్నారు. వై నాట్ 175 అని కారు కూతలు కూసిన బ్యాచ్ కు నిన్నటి టీజర్ తోనే దిమ్మ తిరిగి ఉంటుందని, టీజర్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ముత్యాలముగ్గు చిత్రంలో సంగీత మాదిరిగా మా పార్టీకి చెందిన ఎంపీ, పేరు చివరన రెండు అక్షరాలు ఉన్న నాయకులు పసుపు నీళ్లతో పులివెందుల పూల అంగడికి ప్రాంగణాన్ని కడిగారట అంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు.
కడగటం అలవాటయిన వారు పులివెందుల పూల అంగడిని కూడా పసుపు నీళ్లతో కడిగారని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దీటైన సమాధానం ఇచ్చారని, కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి గారు ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి మరి కొంతమంది శుద్ధి చేయడం ఎలాగో ప్రాక్టీస్ చేశారని, ఇప్పుడు కూడా అదే పని చేశారని బీటెక్ రవి అన్నారని పేర్కొన్నారు. పులివెందులలో పసుపు వాన కురిసిందని, పెద్దాయన ప్రసంగాన్ని ముగించి వెళ్ళబోతుంటే… వెళ్లడానికి వీలు లేదని “సార్… ఫలానా కుర్రాడు వేసిన హత్య గురించి మాట్లాడండి… రక్తపు మరకలను ఎలా కడిగారో చెప్పండి” అని అడిగి మరీ మాట్లాడించుకున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.